సద్భావనలు - పునర్జన్మ

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 2.22 ।।

ఆత్మ స్వభానాన్ని వివరిస్తూ శ్రీ కృష్ణుడు పునర్జన్మ సిద్దాంతాన్ని రోజూ మనం చేసే పని ద్వారా స్పష్టముగా వివరిస్తున్నారు.  వస్త్రములు చిరిగిపోయి పనికిరాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము. కానీ ఈ ప్రక్రియ లో మనము మారిపోము. ఇదే విధముగా ఒక దేహమును వదిలి మరోచోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ మార్పునకు లోను కాదు.

పునర్జన్మ ఉంటుందని నిరూపించటానికి గౌతమ మహర్షి న్యాయ దర్శనము ఈ క్రింది వాదన ని చెపుతోంది.

జాతస్య హర్షభయశోక సంప్రతిపత్తేః (3.1.18)

మనం అప్పుడే పుట్టిన నెలల శిశువుని గమనిస్తే ఏ పత్యేకమైన కారణం లేకుండానే ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది ఒక్కోసారి విషాదంగా ఉంటుంది ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. న్యాయ దర్శనము ప్రకారం ఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకొంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ అ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ గుర్తులు మనసులో బలంగా ముద్రింపబడటం వలన అవి గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి. అంతేకాక పుట్టుక మరణము అనే ప్రక్రియలు ఆత్మ కి చాలా బాధాకరమైనవి కనుక అవి పూర్వ జన్మ స్మృతులను చాలా వరకు తుడిచివేస్తాయి.

'న్యాయ దర్శనము' పునర్జన్మ కి మద్దతుగా ఇంకొక వాదనని పేర్కొంటోంది. స్తన్యాభిలాషాత్ (3.1.21)  అనే సూత్రము ద్వారా గౌతమ మహర్షి ఇలా అంటున్నారు. 

అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు, తల్లి తన బిడ్డకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలి?

కానీ అప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వ జన్మలలోజంతు జన్మలలో ఆయా తల్లుల స్తనాలు, పొదుగుల నుండి కూడా చనుబాలు తాగివుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతస్సిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలుపెడుతుంది.

పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోకపొతే మనుష్యుల మధ్య ఉన్న అసమానత అనగా ఒకరు పేద ఒకరు ధనిక ఒకరు ఆరోగ్యంగా మరొకరు అనారోగ్యంగా ఇలా ఎలా జరుగుతున్నది దానికి కారణం ఏమిటో చెప్పడానికి పూర్వజన్మ కర్మ అనికాక మరొక కారణం ఏది అయినా అసంబద్దంగా ఉంటుంది.

ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డి వాడు అనుకోండి. ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి? ఒకవేళ మనము అతని కర్మ వలన ఇలా జరిగింది అంటే అతను ఈ ప్రస్తుత జన్మయే తన ఏకైక జన్మ అని కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాత కర్మలు ఏమీ లేవని వాదించచ్చు. ఒకవేళ అది దేవుని సంకల్పము అంటే అది కూడా నమ్మశక్యంగానిదే. ఎందుకంటే భగవంతుడు పరమ దయ కలవాడు, నిష్కారణముగా ఎవ్వడూ గుడ్డి వాడిగా ఉండాలని కోరుకోడు. కాబట్టి తర్క బద్ధ వివరణ ఒక్కటే కాగలదు. అతను తన పూర్వ జన్మ కర్మ ల ఫలితంగా గుడ్డి వాడిగా పుట్టాడుఅని. అందువలన, సహజవివేకము మరియు వైదిక గ్రంధముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని అవగతం చేసుకోవాలి అని కృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు.

~ గంజాం రామకృష్ణ 

Comments

Popular posts from this blog

Vikhanasa Maharshi

సద్భావనలు: జీవాత్మ - పరమాత్మ