సద్భావనలు: జీవాత్మ - పరమాత్మ

జీవాత్మ - పరమాత్మ 

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ।

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ।। 4.5 ।।

కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నారు. అర్జునా మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. నీవు వాటిని మరిచిపోయావు. కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి తాను అర్జునుడి ముందు మానవ రూపంలో నిల్చుని ఉన్నంత మాత్రమున తనను మానవులతో సమానంగా పరిగణించవద్దు అని వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. 

ఒక దేశ రాష్ట్రపతి ఒక్కోసారి కారాగారానికి చూడడానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు, కానీ మనం జైల్లో రాష్ట్రపతి కనపడితేమనం ఆయన కూడా ఖైదీ నే అని భావింపము.  ఆయన కేవలం తనిఖీ చేయటానికే ఇలా వచ్చాడు అని మనకు తెలుసు. ఇదే ప్రకారంగా భగవంతుడు ఒక్కోసారి ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తూ ఉంటారు. శ్రీ కృష్ణుడు భగవంతుడు కాడు అని ఏ మూర్ఖులకైనా సందేహం ఉంటే దానిని ఖండించటానికే ఆయన ఈ శ్లోకం చెప్పాడు. నమ్మకం లేని కొంత మంది శ్రీ కృష్ణుడు కూడా మనలాగే పుట్టాడు మనలాగే భుజించాడు, త్రాగాడు, నిద్రపోయాడు; కాబట్టి ఆయన భగవంతుడు అవ్వటానికి అవకాశం లేదు అని వాదించవచ్చు. ఇక్కడ శ్రీ కృష్ణుడు జీవాత్మకి, భగవంతునికి ఉన్న తేడాని స్పష్టంగా వివరిస్తున్నారు.

పరమాత్మను అయిన నేను ఎన్నో సార్లు ఈ ప్రపంచంలో అవతరించాను నేను ఆ అన్ని జన్మల జ్ఞానం కలిగి ఉన్నాను. అదే సమయంలో జీవాత్మలమయిన మనజ్ఞానం మాత్రం పరిమితమైనది.

జీవాత్మకి పరమాత్మ అయిన భగవంతునికి చాలా పోలికలున్నాయి. 

 - రెండూ సత్-చిత్-ఆనందములే, రెండూ ఆనాది గా ఉన్నవి.  

 - చైతన్యవంతమైనవి.

 - ఆనంద స్వరూపాలు. 

కానీ ఎన్నో తేడాలు కూడా ఉన్నాయి. 

 - భగవంతుడు సర్వ వ్యాపి, జీవాత్మ తను ఉన్న శరీరంలోమాత్రమే వ్యాపించి ఉంటుంది. 

 - భగవంతుడు సర్వశక్తివంతుడు సమస్త సృష్టి కర్త. కానీ జీవాత్మల మయిన మనకు  చిన్న పదార్థమును సృజించె శక్తి కూడా లేదు. 

 - సృష్టిలోని  పంచభూతాలు పరమాత్మ అనుగ్రహముతో నడుస్తున్నాయి. వాటిని మన ఆస్తులుగా భావిస్తున్నాము. 

 - భగవంతుడు ఈ ప్రకృతి నియమాలను సృష్టించిన వాడు. జీవాత్మ ఈ నియమాలకు బద్దుడై ఉండాలి. 

 - సమస్త సృష్టిని నిర్వహించేవాడు భగవంతుడు. జీవాత్మ కూడా అతనిచేతనే నిర్వహింపబడుతుంది.

 - భగవంతుడు సర్వజ్ఞుడు. కానీ జీవాత్మ ఒక్క విషయం పైన కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండదు.

 ~ గంజాం రామకృష్ణ 

Comments

Popular posts from this blog

Vikhanasa Maharshi