సద్భావనలు - ఆరాధన

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।

తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।। 9.26 ।।

శ్రీహరి యొక్క ఆరాధన ఎంత సులువైనదో ఎంత విలువైనదో ఈ శ్లోకం మనకు తెలుపుతుంది.  

దేవతల ఆరాధనలో వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో  సమర్పించబడిన ఏదైనా స్వీకరిస్తాడు. 

మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే అది సమర్పించండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వు సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే భగవంతునికి కేవలం ఒక ఆకు సమర్పించండి; ప్రేమతో ఇచ్చినప్పుడు అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి. కానీ ఇక్కడ కూడా అది భక్తితో అనగా ప్రేమగా ఇవ్వబడాలి. 

భక్త్యా అన్న పదం ఇక్కడ మొదటి మరియు రెండవ భాగాల్లో రెంటిలో వాడబడింది. ఆరాధించే వారి (భక్తుని) యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది, ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు.

ఈ అద్భుతమైన ప్రకటన చేయటంతో భగవద్గీత భగవంతుని యొక్క కరుణాపూరిత స్వభావాన్ని తెలియచేస్తున్నది. తన యందు ప్రేమతో సమర్పించబడిన వస్తువు యొక్క భౌతిక విలువ శ్రీహరికి  అవసరం లేదు. అన్నింటికన్నా ఎక్కువగా, ఎంత ప్రేమగా ఇచ్చామో అనేదే అయనకు ముఖ్యం. 

హరి భక్తి విలాసం అనే గ్రంథంలో ఇలా ఉన్నది. 

తులసీ దళ మాత్రేణ జలస్య చులుకేన చ

విక్రీణీతే స్వం ఆత్మానం  భక్తేభ్యో భక్త-వత్సలః (11.261)

శ్రీహరికి నిజమైన ప్రేమతో, ఒక తులసి ఆకు మరియు మీ దోసిట్లో పట్టేంత నీరు సమర్పిస్తే, బదులుగా ఆయన తననే మీకు సమర్పించుకుంటాడు, ఎందుకంటే ఆయన వశ్యమయ్యేది నిజమైన భక్తికే.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అనిర్వచనీయమైన మహాద్భుత గుణములు కలవాడు శ్రీహరి.  సంకల్ప మాత్రం చేతనే అనంతమైన బ్రహ్మాండాలు సృజించి నిలిపి లయము చేయగల ఆయన తన భక్తునిచే నిజమైన ప్రేమతో సమర్పించబడిన అత్యల్పమైన దాన్ని కూడా స్వీకరిస్తాడు. 

ఇక్కడ 'ప్రయతాత్మనః' అన్న పదం వాడబడిందిఅంటే "కల్మషములేని పవిత్ర హృదయం (మనస్సు) తో ఉన్న వారు సమర్పించే దానిని స్వీకరిస్తాను" అని. భావము.

శ్రీమద్భాగవతం లో కూడా సరిగ్గా  కుచేలుడు ప్రేమగా సమర్పించిన అటుకులు స్వీకరిస్తూ శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు:

నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను.

ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి.

మహాభారత యుద్ధం ముందు, శ్రీ కృష్ణుడు, కౌరవులు, పాండవుల మధ్య సంధి కుదిర్చే ప్రయంత్నంలో హస్తినాపురం వెళ్లినప్పుడు దుష్టుడైన దుర్యోధనుడు గర్వంతో యాభై-ఆరు విభిన్న వంటకాలతో విందు ఏర్పాటు చేసాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఈ ఆథిధ్యాన్ని తిరస్కరించి తన భక్తురాలి కుటీరానికి వెళ్ళాడు.

ఆమె ఎప్పటినుండో తన ఇష్టదైవాన్ని సేవించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. కృష్ణుడు ఇంటికి రావటం తో ఆమెక అమితంగా సంతోషపడింది. ఆమె దగ్గర ఇవ్వటానికి కేవలం అరటి పండ్లే ఉన్నాయి, కానీ ప్రేమభావనలో ఆమె బుద్ది ఎంతగా అయోమయం అయిపోయిందంటే ఆమె పండు పడేసి, తొక్కలు ఆయనకు ఇచ్చింది.  ఐనప్పటికీ, ఆమె భక్తి ని చూసిన శ్రీ కృష్ణుడు, ప్రపంచంలో అదే అత్యంత రుచికరమైనదన్నట్టు, పరమానందంతో వాటిని స్వీకరించి ఆరగించి ఆమెను అనుగ్రహించాడు. భక్తి మాత్రమే పరమాత్మ కు మనల్ని దగ్గర చేయగలదు. 

భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోపరమం పదం గచ్ఛతీతి విజ్ఞాయతే.

~ గంజాం రామకృష్ణ 

Comments

Popular posts from this blog

Vikhanasa Maharshi

సద్భావనలు: జీవాత్మ - పరమాత్మ